చట్టసభలలో అధికార పార్టీ సభ్యులు తమ ప్రభుత్వం గురించి స్వంత డబ్బా కొట్టుకోవడం, ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంలో లోపాలను ఎత్తిచూపుతూ తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తుండటం చాలా సహజమే. కొంచెం ఎక్కువ తక్కువ స్థాయిల్లో అన్ని చోట్ల ఇదే జరుగుతుంటుంది. తెలంగాణా విధానసభలో కూడా ఇదే జరిగింది.
ఇసుక మాఫియాపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. బూర్గంపాడులో ఒక రౌడి అధికార పార్టీ పేరు చెప్పుకొంటూ అక్రమ ఇసుక రవాణా చేస్తూ అందరినీ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెరాస సర్కార్ హయంలో రాష్ట్రంలో ఇసుక మాఫియా పెరిగిపోయిందని విమర్శించారు.
వారి విమర్శలకుమంత్రి కేటిఆర్ స్పందిస్తూ “వంద ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు బయలుదేరిందన్నట్లున్నాయి కాంగ్రెస్ నేతల మాటలు. నాలుగున్నర దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అన్నేళ్ల తమ పాలనలో ఒక్క మంచి పని చేయలేకపోయినా అన్ని రంగాలలో అవినీతిని చాలా చక్కగా పెంచి పోషించింది. ఆ అలవాటు ప్రకారమే కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఇప్పుడు కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నట్లున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి మాకు అప్పగిస్తే మా ప్రభుత్వం ఆ లోపాలనన్నిటినీ ఒకటొకటిగా సరిదిద్దుకొస్తోంది.
మా ప్రభుత్వంలో ఎక్కడా అవినీతి జరుగడం లేదని నేనేమి చెప్పడం లేదు కానీ ఎక్కడ అవినీతి జరిగిన్నట్లు తెలిసినా చాలా కటినమైన చర్యలు తీసుకొంటున్నాము. అవినీతిని అరికట్టేందుకు ఏమేమి చర్యలు తీసుకోవచ్చో అవన్నీ తీసుకొంటూనే ఉన్నాము. బూర్గంపాడులో మా పార్టీ పేరు చెప్పుకొని దౌర్జన్యం చేస్తున్న వ్యక్తిని ఉపేక్షించబోము.
కుంభకోణాలు చేయడానికి అలవాటుపడిన కాంగ్రెస్ నేతలకి ప్రభుత్వం చేస్తున్న మంచిపనులు కనబడటం లేదు. వారికి ఎప్పుడూ అన్నిచోట్ల అవినీతే కనబడుతుంటుంది. అందుకే ఇసుక మాఫియా అని గొంతు చించుకొని అరుస్తున్నారు. నిజానికి మా ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన ఇసుక విధానం వలన ఇసుక మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే అది మరింత స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తూ మా ప్రభుత్వంపై బురద జల్లాలనే ఆలోచనమానుకోకపోతే ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.