దేశంలో 17 బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అతనిపై ఇంటర్ పోల్ ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలనే భారత్ అభ్యర్ధనను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం మీడియాకు తెలిపారు. భారత్ అభ్యర్ధన మేరకు బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయవలసిందిగా కోరుతూ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టును కోరినట్లు తెలిపారు. కోర్టు అనుమతించగానే విజయ్ మాల్యా పేరిట అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈలోగా అతను మళ్ళీ వేరే దేశం పారిపోకుండా నిలువరించవలసి ఉంది. ఒకవేళ పారిపొయినా ఇంటర్ పోల్ ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ అయితే అతను ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసి భారత్ తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.
భారత ప్రభుత్వం ఇంతవరకు అతనికి చాలా అవకాశాలు ఇచ్చింది. మర్యాదగా తిరిగి వచ్చి రుణాలను తిరిగి చెల్లించమని, లేకుంటే కటినచర్యలు తప్పవని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. సుప్రీంకోర్టు, ఈడి నోటీసులు పంపాయి. కానీ భారత్ వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి లండన్ లో విలాసంగా జీవిస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయితే ఒక ఖైదీలాగ అరెస్ట్ చేసి తీసుకురాబడతాడు. కనుక విజయ్ మాల్యా ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని తనంతట తానుగా భారత్ తిరిగి వచ్చి సుప్రీంకోర్టుకు లొంగిపోతే గౌరవంగా ఉంటుంది.