హైదరాబాద్ లో ఐసిస్ ఉగ్రవాదులు!

జమ్మూ కాశ్మీర్ లో తరచూ రెపరెపలాడే ఐసిస్ జెండాలు అక్కడ ఐసిస్ సానుభూతిపరులున్నారని నిదర్శనంగా సూచిస్తున్నాయి. ఈ మద్యనే యూపి, బిహార్ లో కూడా ఐసిస్ పోస్టర్లు వెలిసాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని హబీబ్ నగర్ లో ఒక ఇంటిలో నుంచి ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానించబడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద తుపాకులు, కత్తులు, కంప్యూటర్ మొదలైన వస్తువులు స్వాధీనం చేసుకొన్నారు. నగరం నడిబొడ్డున తీవ్రవాదులు పట్టుబడటం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తోంది. వారిని అరెస్ట్ చేసిన తరువాత పరిసర ప్రాంతాలలో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు ఐసిస్ లో చేరేందుకు వెళుతుండగా నిఘా వర్గాల సమాచారం అందుకొని మహారాష్ట్ర పోలీసులు వారిని నాగపూర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. నగరంలో భద్రతను పోలీసులు చాలా కట్టుదిట్టం చేసి తరచూ అనుమానస్పద ప్రాంతాలలో గాలింపులు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు వారి కళ్ళు గప్పి ఈవిధంగా తమ కార్యకలాపాలను సాగిస్తూనే ఉన్నారు.