ఆ ఎంపి ఇక విమానం ఎక్కలేరు

మహారాష్ట్రలోని శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ నిన్న పూణే నుంచి డిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వెళుతున్నప్పుడు తనకు బిజినెస్ క్లాస్ లో సీటు కేటాయించనందుకు ఆగ్రహించి ఆ సంస్థ ఉన్నతాధికారిని తన చెప్పుతో కొట్టారు. అంతేకాదు.. తను అతనిని 25సార్లు చెప్పుతో కొట్టానని గర్వంగా చెప్పుకొన్నారు. అయితే తాను అందుకు ఎవరికీ క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదని, ఆ విమాన సంస్థ అధికారులు, విమానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు బెదిరిస్తే భయపడిపోవడానికి తానేమీ భాజపా ఎంపిని కానని శివసేన ఎంపినని గర్వంగా చెప్పారు. 

అతని అనుచిత ప్రవర్తనను శివసేనతో సహా అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఖండించారు. అతనిని సభ నుంచి బహిష్కరించాలని సభ్యులు డిమాండ్ చేశారు. శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే కూడా తమ ఎంపి ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సంజాయిషీ కోరారు. 

ఇక తాజా పరిణామం ఏమిటంటే, దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల సంఘం ఇక నుంచి అతను తమ విమానాలలో ప్రయాణించడానికి అనుమతించబోమని ప్రకటించాయి. ఎయిర్ ఇండియా సంస్థ కూడా అతను తమ విమానంలో డిల్లీ నుంచి పూణే వెళ్ళడానికి అనుమతించలేదని సమాచారం. ఇంత జరిగినా అతనిలో ఏమాత్రం సిగ్గు, పశ్చాతాపం కలుగకపోగా డిల్లీ పోలీసులకు దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాలు విసరడం విస్మయం కలిగిస్తుంది. 

రవీంద్ర గైక్వాడ్ ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి ఇంత అనుచితంగా, ఇంత అహంకారంగా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇంతవరకు అతనిపై చట్టప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా తప్పే.