భాజపా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్

తెలంగాణా శాసనసభలో ఐదుగురు భాజపా సభ్యులపై రెండు రోజులు సస్పెన్షన్ వేటు పడింది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే తెరాస సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తునందున వారిని శాసనసభ నుంచి రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. జాతీయ స్థాయిలో.. పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ నిత్యం మోడీ ప్రభుత్వంతో యుద్దాలు చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణాలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించడం విశేషం. భాజపా సభ్యులపై సస్పెన్షన్ విదించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు కూడా సభ నుంచి వాక్ అవుట్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు సభలో సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన తెలంగాణా శాసనసభ దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతిపక్ష సభ్యులకు సభలో తగినంత మాట్లాడే అవకాశం కల్పిస్తూ, వారు చేసే నిర్మాణాత్మకమైన సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకొంటున్నాము,” అని అన్నారు.