తూచ్..ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు: రజనీ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్.కె.నగర్ నియోజకవర్గంలో వచ్చే నెల 12న ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. దానిలో భాజపా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ ప్రముఖ నటుడు రజనీకాంత్ ను కలిసి మద్దతు కోరారు. ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు రజనీ ప్రకటించకపోయినప్పటికీ  ఆశీర్వదించి పంపారు. ఆ సందర్భంగా వారిరువురు కలిసి తీసుకొన్న ఒక ఫోటోను గంగై అమరన్ కుమారుడు వెంకట ప్రభు సోషల్ మీడియాలో పెట్టారు. దానితో భాజపా అభ్యర్ధికి రజనీకాంత్ మద్దతు ఇస్తున్నారని ప్రచారం ఊపందుకొంది. ఈ సంగతి తెలుసుకొన్న రజనీకాంత్ తను ఎవరికీ మద్దతు ఈయడం లేదని ట్వీట్ చేశారు. 

రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని చాలా ఏళ్ళుగానే ఆలోచిస్తున్నారు. కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. గంగై అమరన్ కూడా సినీపరిశ్రమలోనే ఉన్న కారణంగా రజనీకాంత్ ఆయనకు ఆశీసులు ఇచ్చి ఉండవచ్చు. కానీ అది ప్రజలకు వేరేలా చేరడంతో మళ్ళీ ఈవిధంగా ప్రకటించవలసి వచ్చింది. 

తమిళచిత్ర పరిశ్రమలో రజనీకాంత్ ఒక్కడికే ఇటువంటి అగ్నిపరీక్షలు ఎందుకు ఎదురవుతున్నయంటే, తనకు  రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఉన్నట్లు మాట్లాడినందునే. అయితే ఆయనకు రాజకీయాలలోకి ప్రవేశించాలనే ఆసక్తి, ఓపిక రెండూ లేనప్పుడు అదే విషయం నిర్ద్వందంగా చెప్పి ఉండి ఉంటే రాజకీయ నేతలు ఎవరూ ఆయన జోలికి వెళ్ళే ఆలోచన చేసేవారు కాదు. కానీ రజనీకాంత్ ఆ ముక్క చెప్పకుండా అందరినీ తన చుట్టూ తిప్పించుకొంటున్నారు. అలాగ చేయడం వలన ఆయనకు ఏమి ఆనందం కలుగుతోందో ఏమో?