ఆ బిల్లు ఇప్పుడు కాదుట

రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెరాస సర్కార్ శాసనసభలో ప్రవేశపెట్టబోయే బిల్లును వ్యతిరేకిస్తూ నేడు భాజపా ఛలో అసెంబ్లీ పేరిట అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించింది. అయితే ఆ బిల్లు ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టే అవకాశం లేదని తాజా సమాచారం. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్  దాఖలైంది. ఈ నెలాఖరులోగా బిసి కమీషన్ పిటిషనర్ అభ్యంతరాలను విని, అతనికి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలని హైకోర్టు ఆదేశించింది. కనుక ఆ కార్యక్రమం పూర్తయితే గానీ తెరాస సర్కార్ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాకపోవచ్చు. అదేమీ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాకపోయినప్పటికీ, మున్ముందు ఇంకెవరైనా కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసినట్లయితే అప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఈ బిల్లును పక్కన పెట్టవలసి రావచ్చు. కనుక ముందుగా ఈ సమస్యను ఏవిధంగా అధిగమించాలనే దానిపై ఆలోచించవలసి ఉంటుంది.