ఎమ్మెల్సీ ఎన్నికలలో కాటేపల్లి విజయం

ఇటీవల జరిగిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి కూడా గత ఎన్నికలలో మాదిరిగానే రెండవ ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికలలో గెలిచేందుకు 9,670 ఓట్లు అవసరంకాగా 9,734 ఓట్లు సాధించగలిగారు. జనార్ధన్ రెడ్డి మొదటి రౌండ్ లోనే 7,640 ఓట్లు గెలుచుకొని మిగిలిన అభ్యర్ధుల కంటే పూర్తి ఆధిక్యత సాధించినప్పటికీ, అవి గెలుపుకు సరిపోవు గనుక రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించవలసి వచ్చింది. ఆ కార్యక్రమం నిన్న అర్ధరాత్రి వరకు సాగింది. చివరకు జనార్ధన్ రెడ్డి 9,734 ఓట్లు సాధించడంతో ఓట్ల లెక్కింపు నిలిపి వేసి ఆయన గెలిచినట్లు ప్రకటించారు.