తెలంగాణా, ఆంధ్రా పార్టీలకు శుభవార్త

రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు ముఖ్యంగా అధికారంలో తెరాస, తెదేపాలకు వాటి నేతలకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు ప్రకటించారు. 

మొదట దీనిపై తెరాస ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్, సీట్ల పెంపు ఆలోచన లేదని లిఖితపూర్వకంగా చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెంటనే చొరవ తీసుకొని దీని గురించి హోంమంత్రితో మాట్లాడి ఆయన చేత ఈరోజు దీనిపై పార్లమెంటులో ప్రకటన చేయించారు. 

ఇంతకీ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారంటే, “రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచాలనే విభజన చట్టంలో ఇచ్చిన హామీకి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏప్రిల్ 12వరకు సాగే ఈ పార్లమెంటు సమావేశాలలోనే దీని కోసం ఒక బిల్లును ప్రవేశపెడతాం. ఒకవేళ ఏ కారణం చేతైనా వీలుపడకపోతే వచ్చే పార్లమెంటు సమావేశాలలో తప్పకుండా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తాము,” అని చెప్పారు. 

అనంతరం వెంకయ్య నాయుడు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “దీని కోసం త్వరలోనే క్యాబినెట్ నోట్ తయారుచేస్తాము. సీట్లు పెంపుదలకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా వెనుకాడం. రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు తప్పకుండా పెంచుతాము,” అని చెప్పారు. 

ప్రస్తుతం ఆంధ్రలో 150, తెలంగాణాలో 119 సీట్లు ఉన్నాయి. వాటిని వరుసగా 225, 150కు పెంచాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. వాటి కోరిక నెరవేరబోతోంది కనుక రెండు పార్టీలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఇక నిశ్చింతగా ఉండవచ్చు.