ఈరోజు శాసనసభలో మిషన్ భగీరథపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ కు మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ఆ ప్రాజెక్టు ఉద్దేశ్యం మంచిదే అయినా దానిలో అనేక అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని, ఆ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,000 కోట్లు పైగా నష్టం కలిగిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దానిలో ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉన్నవారు పైసా పెట్టుబడి లేకుండా పనులు దక్కించుకొని, తమ చేతికి మట్టి అంటకుండా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి అక్రమంగా ప్రభుత్వ సొమ్మును దోచుకుతింటున్నారని ఆరోపించారు.
వారిలో చాలా మంది ఆంధ్రావారేనని, ప్రభుత్వం వారికి సకాలంలోనే చెల్లింపులు చేస్తున్నప్పటికీ తమ వద్ద పనిచేస్తున్న తెలంగాణాకు చెందిన సబ్ కాంట్రాక్టర్లకు రెండు నెలల తరువాత కొద్ది కొద్దిగా చెల్లిస్తున్నారని, ఆ కారణంగా తెలంగాణా సబ్ కాంట్రాక్టర్లు అప్పులపాలయ్యి ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పారు. కనుక నకిలీ కాంట్రాక్టర్లను, వారు చేస్తున్న ఈ అవకతవకలను గుర్తించి, వారిని తొలగించి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వారి నుంచి రికవరీ చేయడానికి వీలుగా ఒక హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
ఆయనకు మంత్రి కేటిఆర్ సమాధానం చెపుతూ, “గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి రికార్డులన్నీ మా దగ్గరున్నాయి. కాంగ్రెస్ నేతలు అవినీతి తప్ప మరేమీ చేయనప్పటికీ రాష్ట్రానికి, దేశానికి చాలా చేశామని చెప్పుకొంటున్నారు. వారికి అవినీతికి పాల్పడటం అలవాటు కనుక నేటికీ ఇంకా అవినీతి జరిగిపోతూనే ఉంటుందని భావిస్తున్నట్లున్నారు. మిషన్ భగీరథపై క్రిందటిసారి సమావేశాలలో ఇవే ఆరోపణలు చేశారు. అప్పుడు వాటికి ఆధారాలతో సహా వివరణ ఇచ్చాము. మళ్ళీ ఈరోజు అవే ప్రశ్నలు అడుగుతున్నారు. మిషన్ భగీరథలో ఎక్కడా అవినీతి జరుగలేదు. దాని పనులన్నీ చాలా పారదర్శకంగా జరుగుతున్నాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన మనసులో ఉన్న అనుమానాలను, భయాలను ప్రజలపై, మా ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే తమ కాళ్ళ క్రిందకు నీళ్ళు వస్తాయనే ఆందోళనతోనే కాంగ్రెస్ నేతలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎన్ని అవరోధాలు సృష్టించినా మీకు, ప్రజలకు కూడా నీళ్ళు తాగించి చూపిస్తాము.
మీరు సిబిఐకి, ఇంకా ఎవరెవరికో ఇక్కడ అవినీతి జరిగిపోతోందని లేఖలు వ్రాశామని చెప్పారు. దానిని మేము స్వాగతిస్తున్నాము. మేము అవినీతికి పాల్పడితే భయపడాలి కానీ పారదర్శకంగా పనిచేస్తున్నప్పుడు ఎవరికీ భయపడనవసరం లేదు. కనుక దీనికోసం హౌస్ కమిటీని ఏర్పాటు చేయనవసరం లేదు. జానారెడ్డిగారు ఏదో మీరు బాధపడతారని మొహమాటానికి లేచి హౌస్ కమిటీ వేయాలని అడిగారు కానీ వాస్తవాలు ఆయనకు తెలుసు. ఇక మీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో బాత్రూంలు లేవని అన్నారు. ఈ సమస్యలన్నిటినీ మేము ఒకటొకటిగా పరిష్కరించుకొని వస్తున్నాము. 60 ఏళ్ల పాపాలను, అవినీతిని మూడేళ్ళలో తుడిచిపెట్టేయలేము కదా? పోతూ పోతూ మీరేమీ మాకు అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోలేదు కదా..రాత్రికి రాత్రే అన్ని సమస్యలను పరిష్కరించేయడానికి?” అని అన్నారు.
హౌస్ కమిటీ వేయనందుకు నిరసనగా సభ నుంచి వాక్ అవుట్ చేస్తున్నామని జానారెడ్డి ప్రకటించడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.