2013లో రూపొందించిన ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్-ప్లాన్)కు తెలంగాణా ప్రభుత్వం కొత్త రూపురేఖలు ఇచ్చింది. దానికి ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’ చట్టం అనే కొత్త పేరు పెట్టింది. దళిత, గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పథ బిల్లులో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఏవిధంగా ఎక్కడెక్కడ ఖర్చు చేయాలనే ప్రణాళిక ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిధులు సంక్షేమ శాఖ అధీనంలో ఉంచి, అవసరాన్ని బట్టి వినియోగిస్తారు. ఒకవేళ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోగా ఆ నిధులు ఖర్చు చేయలేకపోతే మిగిలిపోయిన ఆ నిధులను మరుసటి సంవత్సరానికి బదిలీ అయ్యే విధంగా కొత్త చట్టంలో వీలు కల్పించబడింది. నిధుల ఖర్చుకు ముందస్తు ప్రణాళికా విధానం ఉండదు కనుక నిధుల దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ సంబంధిత అధికారులు జవాబుదారీగా ఉండేవిధంగా కొత్త చట్టంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంది. రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకోబోతోంది.
ఏ చట్టమైన రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు ఉపయోగపడేలాగే రూపొందించబడుతుంది. కానీ ఆచరణలో విఫలం అవుతుండటం వలననే ఆ చట్టాలు కాగితాలకు, న్యాయస్థానాలకే పరిమితం అయిపోతున్నాయి. ఆ కారణంగానే స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినప్పటికీ దేశంలో ఇంకా పేదరికం, దారిద్ర్యం తాండవిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు. కనుక తెరాస సర్కార్ పేరు మార్చి కొత్తగా ప్రవేశపెడుతున్న చట్టం అయినా వారికి న్యాయం చేకూర్చగలిగినప్పుడే అది సార్ధకం అవుతుంది. లేకుంటే అది కూడా దేశంలో ఉన్న వేలాది చట్టాలలో ఒకటిగా మిగిలిపోతుంది.
నిజానికి ఏ పార్టీకి అధికారం దక్కినా దానిని ఒక సువర్ణావకాశంగా భావించి రాష్ట్రం, దేశం, ప్రజలు అందరికీ మేలు చేకూర్చగలిగితే, వాటికి వాటి నేతలకు చరిత్రలో అజరామరమైన కీర్తి లభిస్తుంది. ఇప్పుడు మనం గాంధీ, నెహ్రూ, సుబాష్ చంద్రబోస్ వంటి మహనీయుల గురించి గౌరవంగా తలచుకొంటున్నట్లే, భావితరాలు కూడా రాష్ట్రాభివృద్ధికి పాటుపడిన నేటి తరం నేతల గురించి గొప్పగా చెప్పుకొనే అవకాశం ఉంటుందని అందరూ గుర్తించాలి.