రాజకీయ నేతలు మహిళా సాధికరికత గురించి ఎన్ని గంటలైనా అనర్గళంగా మాట్లాడగలరు. కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా వ్యవహరిస్తుంటారు. టీ-కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయమే అందుకు తాజా ఉదాహరణ.
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చైర్ లో కూర్చొన్నప్పుడు తమకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వడంలేదని, కనుక ఆమె సభను నడిపించడానికి వచ్చినప్పుడు నిరసనగా సభ నుంచి వాక్ అవుట్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నిర్ణయించుకొన్నారు. భాజపా, తెదేపా సభ్యులు కూడా వాక్ అవుట్ చేయబోతున్నట్లు సమాచారం.
పద్మా దేవేందర్ రెడ్డి సభను ఎంత చక్కగా నడిపిస్తారో అందరికీ తెలుసు. స్పీకర్ మధుసూదనాచారికి ఏమాత్రం తీసిపోకుండా ఆమె సభను చాలా సమర్ధంగా నిర్వహిస్తున్నందుకు అందరూ ఆమెను ప్రశంశిస్తుంటారు. శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి కనుక ఆమె ఏవిధంగా సభను నడిపిస్తున్నారో ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. శాసనసభలోనే కాకుండా తన నియోజకవర్గం అభివృద్ధికి ఆమె చాలా కృషి చేస్తున్న కారణంగా అక్కడా ఆమెకు చాలా మంచిపేరు ఉంది.
నిన్నటి సమావేశాలలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సుదీర్గంగా ప్రసంగించారు. తెరాస సర్కార్ ను పలు అంశాలపై ప్రశ్నించారు. గతంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంత సమర్ధంగా పరిపాలించిందో సోదాహరణంగా వివరించారు. ఆయనకు ఇచ్చిన సమయం అయిపోయిందని కనుక ప్రసంగం త్వరగా ముగించమని స్పీకర్ మధుసూదనాచారి పదేపదే సూచిస్తున్నా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
స్పీకర్ విరామం తీసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆయన స్థానంలో పద్మా దేవేందర్ వచ్చి కూర్చొన్న తరువాత కూడా భట్టి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె కూడా ప్రసంగం ముగించమని భట్టిని చాలాసార్లు హెచ్చరించినప్పటికీ ఆయన కొనసాగిస్తుండటంతో ఆయన మైక్ ను కట్ చేయవలసి వచ్చింది.
శాసనసభలో ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అంతకు ముందు స్పీకర్ మధుసూదనాచారి కూడా చాలాసార్లు ప్రతిపక్ష సభ్యుల మైక్ కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన ప్రతిపక్ష సభ్యులు గంటల తరబడి ఉపన్యాసాలు దంచుతుంటే మిగిలిన సభ్యులకు ఇతర సమస్యల గురించి మాట్లాడే అవకాశం లభించదనే ఉద్దేశ్యంతోనే స్పీకర్ చైర్ లో ఉన్నవారు ఆవిధంగా వ్యవహరించవలసి వస్తుందని అందరికీ తెలుసు. అయినా కాంగ్రెస్ నేతలు సభ నుంచి వాక్ అవుట్ చేయాలనుకోవడం మహిళల పట్ల చులకనభావం ప్రదర్శించడమే అని చెప్పకతప్పదు.