మీకో దండం..దయచేసి పన్నులు కట్టండి!

“పురజనులకు విజ్ఞప్తి..మీ ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించకపోతే మీ ఆస్తులు జప్తు చేయబడతాయి..ఇట్లు మున్సిపల్ కమీషనర్,” అనే హెచ్చరికలు అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. కానీ ఆస్తిపన్ను చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్ ఎక్కడా ధర్నా చేయడం చూసి ఉండము. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇది జరిగింది. గద్వాల్ పట్టణంలో విశ్వేశ్వరయ్య మెమోరియల్ హైస్కూల్ చాలా కాలంగా మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లించడం లేదు. స్కూలు యాజమాన్యానికి ఎన్ని నోటీసులు పంపించిన పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కమీషనర్ సంధ్య నిన్న తన సిబ్బందితో కలిసివచ్చి ఆ స్కూలు ముందు కూర్చొని తక్షణమే ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ ధర్నా చేశారు. వారు ధర్నాకు కూర్చొన్న సంగతి తెలిసి స్కూలు యాజమాన్యం దిగివచ్చింది. త్వరలోనే ఆస్తిపన్ను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. 

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాల సకాలంలో పన్నులు చెల్లించకపోవడం, దాని కోసం స్వయంగా కమీషనర్ ధర్నా చేయవలసిరావడం రెండూ విచిత్రమే కదా!