అవినీతిలో ఏపి నెంబర్: 1, తూచ్..కాదు: బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ ల మద్య నిన్న శాసనసభలో చాలా తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. ఇద్దరూ నువ్వు అవినీతిపరుడువి అంటే నువ్వే పెద్ద అవినీతిపరుడివి అని ఒకరినొకరు దూషించుకొన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “అవినీతిలోనైనా అభివృద్ధిలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో నెంబర్: 1 స్థానంలో ఉంటుంది ఎప్పుడూ,” అని నోరు జారారు. తెదేపా ప్రభుత్వం అవినీతిమయం అని వైకాపా వాదనకు సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ద్రువీకరించినట్లయింది. తను నోరు జారిన సంగతి చంద్రబాబు గుర్తించేలోగానే సాక్షి మీడియాలో ఆయన మాటలను పదేపదే ప్రముఖంగా ప్రసారం చేసింది కూడా. ఆయన పొరపాటున నోరుజారారని అందరికీ అర్ధం అవుతూనే ఉంది. కానీ శాసనసభలో వైకాపా సభ్యులు తెదేపా అవినీతి గురించి మాట్లాడుతున్నప్పుడే ముఖ్యమంత్రి ఈవిధంగా మాట్లాడి వారికి అడ్డంగా దొరికిపోయారు. 

జరిగిన నష్టాన్ని గుర్తించిన చంద్రబాబు ఈరోజు శాసనసభలో తన మాటలను సవరించుకొంటూ “అవినీతిని నిర్మూలించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్: 1 అని చెప్పబోయి పొరపాటున ఆవిధంగా అనేశాను. మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలన సాగిస్తోంది. మా ప్రభుత్వంలో అవినీతి ఉందని వాదిస్తున్న జగన్ కి దానిని నిరూపించమని సవాలు విసురుతున్నాను. అవినీతిపై చర్చకు మేము సిద్దం,” అని అన్నారు.