జగన్..అరిగిపోయిన ఆ రికార్డును ఆపేయ్!

తెదేపా ఎంపి జెసి దివాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా చురకలు వేస్తుంటారు. ఇక జగన్మోహన్ రెడ్డిని విడిచిపెడతారా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఇవ్వాళ్ళ ఆయన  మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి తన తండ్రి గురించి మాట్లాడేటప్పుడు మన ప్రియతమ నేత..దివంగతనేత..అంటూ అరిగిపోయిన రికార్డు వేస్తుంటారు. దానిని ఇక ఆపేస్తే మంచిది. ఎందుకంటే అతను తన తండ్రి పేరును 2014 ఎన్నికలలోనే పూర్తిగా వాడేసుకొన్నాడు. కనుక వచ్చే ఎన్నికలలో అరిగిపోయిన ఆ రికార్డు వేసినా ఉపయోగం ఉండదు. ఏదైనా ఒక కొత్త హామీ లేదా పధకంతో ప్రయత్నిస్తే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు. అయినా ఏ ప్రాంతీయపార్టీ అయినా మొదటి ప్రయత్నంలోనే అధికారంలోకి రాగాలిగితేనే మళ్ళీ ఎప్పుడైనా దానికి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వైకాపా రాలేకపోయింది కనుక వచ్చే ఎన్నికలలో కూడా దానికి అవకాశం దక్కకపోవచ్చు,” అని అన్నారు. 

ఇక లోకేష్ ఎంట్రీ గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ “లోకేష్ తన తండ్రి ఆస్తులకు ఏవిధంగా వారసుడో అదే విధంగా తండ్రి రాజకీయాలకు కూడా వారసుడవుతాడు. కనుక లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకురావడం పెద్ద విచిత్రమైన విషయమేమీ కాదు,” అని జెసి దివాకర్ రెడ్డి అన్నారు.