దశాబ్దాలుగా నలుగుతున్న బాబ్రీ మశీదు-అయోధ్య రామమందిరం వివాదంపై సుప్రీంకోర్టు నేడు ఇరు పక్షాలకు కొన్ని సూచనలు చేసింది. ఈ సమస్యపై సుప్రీంకోర్టు కలుగజేసుకొని అత్యవసర విచారణ చేపట్టి తీర్పు చెప్పాలని కోరుతూ భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశారు. దానిని విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ ఇరు పక్షాలకు కొన్ని సూచనలు చేశారు. ఇది ప్రజల భావోద్వేగాలతో ముడిపడున్న చాలా సున్నితమైన అంశం కనుక దీనిని కోర్టులో కంటే కోర్టు బయటే పరిష్కరించుకోవడం మంచిది. ఇరు పక్షాలు కూర్చొని చర్చించుకొని ఈ సమస్యకు సామరస్యంగా ఒక పరిష్కారం కనుగొనాలి. ఒకవేళ అవసరమనుకొంటే సుప్రీంకోర్టు మధ్యవర్తులను నియమిస్తుంది. ఈ నెలాఖరులోగా ఇరు పక్షాలు చర్చించుకొని సుప్రీంకోర్టుకు తమ అభిప్రాయం తెలియజేయవలసిందిగా ఆదేశించింది.
ఈ సమస్యకు ఇంతకంటే వేరే మార్గం లేదని అందరికీ తెలుసు. కానీ అటువంటి ప్రయత్నాలు చేయకుండా పరస్పరం విమర్శలు, న్యాయపోరాటాలు చేసుకొంటూ కాలక్షేపంచేయడం వలన ఈ సమస్య రావణకాష్టం లాగ రగులుతూనే ఉంది. కనుక ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం చాలా అవసరమే..మంచిదే!