వాళ్ళు పార్టీకి ద్రోహం చేశారు

సిపిఐ(ఎం) వరంగల్ కు చెందిన మెట్టు శ్రీనివాస్, పి.రవి, ఆడెపు భిక్షపతి, కె. శ్రీను, ఎం.సంపత్, ఎం. రవీందర్, మంద మల్లేశం తెరాస ప్రోద్బలంతో పార్టీని విచ్చినం చేయడానికి ప్రయత్నించడమే కాకుండా, జిల్లాలోని పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు సిపిఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి ఎస్.వాసుదేవరెడ్డి నిన్న ప్రకటించారు. తెరాస విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి వారు తమకు సమాజంలో ఒక గుర్తింపును గౌరవాన్ని కల్పించిన అమ్మ వంటి పార్టీని విచ్చినం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

మంత్రులు కడియం శ్రీహరి, కేటిఆర్, హరీష్ రావులు వారిని ప్రోత్సహించారని ఆరోపించారు. రాష్ట్రంలో తమ పాదయాత్రకు తెరాస సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రజలు మాత్రం తమను చాలా ఆదరించారని అన్నారు. తమ పాదయాత్ర ముగింపు సందర్భంగా  మొన్న సరూర్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభ కూడా కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అవడంతో తెరాస సర్కార్ ఉలిక్కిపడి తమ పార్టీని అభాసుపాలు చేసేందుకే వారిని ప్రలోభపెట్టి లొంగదీసుకొన్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. తెరాస విసిరేసే ఎంగిలి మెతుకులకు ఆశపడిన మెట్టు శ్రీనివాస్ తదితరులు పార్టీ కార్యాలయంపై దాడి చేయడం తల్లి పాలు త్రాగి రొమ్మును గుద్దినట్లేనని అన్నారు. ఈవిధంగా ప్రతిపక్ష పార్టీలను విచ్చినం చేసి తెరాస బలపడాలనుకోవడం చాలా అప్రజాస్వామిక ఆలోచన అని వాసుదేవరెడ్డి విమర్శించారు. మెట్టు శ్రీనివాస్ తో సహా పార్టీ నుంచి సస్పెండ్ అయినవారందరూ నిన్ననే తెలంగాణా భవన్ లో మంత్రి కేటిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.