అవి ఎంగిలి మెతుకులే: కోదండరామ్

తెలంగాణా రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం చేపట్టవలసిన చర్యలను సూచించడానికి తెరాస సర్కార్ సుధీర్ కమిటీని ఏర్పాటు చేసింది. అది ప్రభుత్వానికి 12 సూచనలు చేసింది. వాటినే యధాతధంగా అమలుచేయాలని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. 

ఈ అంశంపై చర్చించేందుకు భువనగిరి యాదాద్రి జిల్లాలో టిజెఎసి మరియు టివియువి ఆధ్వర్యంలో నిన్న ఒక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, “తెరాస సర్కార్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెపుతోంది కానీ తను స్వయంగా ఏర్పాటు చేసిన సుధీర్ కమిటీ చేసిన మిగిలిన సిఫార్సులను అమలుచేయడం లేదు. ముస్లింల సంక్షేమం కోసం వారికి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం, వారి జీవనోపాధికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం, ఉర్దూ పాఠశాలలలో ఖాళీలను భర్తీ చేయడం, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటం వంటి అనేక చర్యలు తీసుకోవలసి ఉండగా తెరాస సర్కార్ వారికి ఎంగిలి మెతుకులు విసిరినట్లుగా షాదీ ముబారక్ వంటి నజరానాలు ప్రకటించేసి చేతులు దులుపుకొంటోంది. సుధీర్ కమిటీ చేసిన అన్ని సిఫార్సులను తెరాస సర్కార్ అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు. 

ఈ సందర్భంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు జవాబు చెపుతూ, “ టిజెఎసిని రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశ్యం మాకు లేదు. అది యదాతధంగానే పనిచేస్తుంది,” అని కోదండరామ్ జవాబు చెప్పారు.