ముందు ఎవరు రాజీనామా చేయాలి?

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలను తెదేపా గెలుచుకోవడంతో తెదేపా-వైకాపాల మద్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు డబ్బులు వెదజల్లి ఎన్నికలలో విజయం సాధించడంలో ఆరితేరిపోయారు. ఆయన మాటలకు చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. నిలువెల్లా అవినీతే అని జగన్ విమర్శించగా, 11 కేసులలో ఏ-1 ముద్దాయిగా ఉండి జైలుకు వెళ్ళివచ్చిన నువ్వా అవినీతి గురించి మాట్లాడేది? అని చంద్రబాబు నాయుడు కూడా ఘాటుగా స్పందించారు. 

ఇక వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా సింహం సింగిల్ గానే వస్తుంది..అంటూ అసందర్భంగా సినిమా డైలాగులు చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలను చూసి భుజాలు చరుచుకొంటున్న తెదేపాకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు. 

చంద్రబాబును దమ్ముంటే ఈసారి పులివెందులలో పోటీ చేయాలని జగన్ సవాలు విసిరారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ, “ఇప్పుడు కడప అయిపోయింది. వచ్చే ఎన్నికలలో మా టార్గెట్ పులివెందులే! వచ్చే ఎన్నికలు తెదేపాకు అనుకూలంగా ఏకపక్షంగా జరుగబోతున్నాయి. జగన్ కు దమ్ముంటే తన ఎమ్మెల్యేలనే రాజీనామాలు చేయించితే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది. మేము డబ్బు వెదజల్లి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచామని జగన్ చెపుతున్నాడు. కానీ అవినీతితో సంపాదించిన లక్ష కోట్లు ఎవరి వద్ద పోగుపడి ఉందో ప్రజలకు కూడా తెలుసు. జగన్ కు దేని గురించి అవగాహన లేదు. చెపితే అర్ధం చేసుకోలేడు. కనుకనే వినడు కూడా. అటువంటి వ్యక్తికి ప్రజలు ఎందుకు అధికారం ఇస్తారు?” అని చంద్రబాబు నాయుడు అన్నారు. 

రెండు పార్టీలు ప్రజలు తమవైపే ఉన్నారని గట్టిగా వాదిస్తున్నాయి. కానీ తెదేపాలోకి ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించడానికి తెదేపా వెనుకాడుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపిల చేత రాజీనామాలు చేయిస్తానని జగన్ ప్రకటించారు కానీ ఆవిధంగా చేస్తే ఎంపిలు కూడా తెదేపాలోకి దూకేస్తారనే భయంఉంది. కనుకనే జగన్ కూడా వెనుకాడుతున్నారు. కానీ రెండు పార్టీలు సవాళ్ళు చేసుకోవడం మానుకోవడం లేదు.