సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్రంలో 4,000 కిమీ పాదయాత్ర చేశారు. దాని ముగింపు సందర్భంగా సరూర్ నగర్ లో నిన్న బారీ బహిరంగ సభ నిర్వహించారు. దానికి తరలివచ్చిన అశేష ప్రజానీకం, వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ప్రముఖ నేతలతో సభ చాలా అట్టహాసంగా సాగింది. ఆ సభను చూస్తే ఇక రాష్ట్రంలో వామపక్షాలకు తిరుగులేదనిపిస్తుంది. కానీ ఆ సభ జరిగి 24 గంటలు కాకముందే వరంగల్ జిల్లాకు చెందిన సిపిఐ(ఎం) కార్యకర్తలు అనేకమంది తెరాసలో చేరిపోయారు.
ఇవ్వాళ్ళ మద్యాహ్నం మంత్రి కేటిఆర్ వారందరికీ గులాబీ కండువాలు కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో కేరళ నుంచి వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కూడా అర్ధం అయ్యింది కానీ మన తమ్మినేనికి మాత్రం అర్ధం కాలేదు. కేరళ ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని, మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకొంటుంటే, మన వామపక్షాలు ఆ అభివృద్ధిని చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. వాటి నేతలు ఎర్ర చొక్కాలు వేసుకొన్నప్పటికీ వారి మనసులు చాలా నల్లగా ఉన్నాయి. ఒకప్పుడు వారు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అడ్డు పడ్డారు. ఇప్పుడు మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, నిజాయితీగా చేస్తున్న పనులకు అడ్డుపడుతున్నారు. అందుకే వారి తీరు నచ్చక నేడు ఆ పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారు. వారు సరైన నిర్ణయమే తీసుకొన్నారు. వారినందరినీ మేము సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము,” అని అన్నారు.