చిరకాలంగా పాలకుల నిర్లక్ష్యానికి గురై తీవ్ర సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్రంలోని చేనేత రంగానికి మళ్ళీ మంచిరోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ చొరవతో తెరాస సర్కార్ చేనేత కార్మికుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టింది. ఆ ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో ఎంతమంది చేనేత కార్మికులున్నారు? చేనేత అనుబంధ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు? వారు ఏ ఉత్పత్తులను, ఎన్ని తయారుచేస్తున్నారు? వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటికి వారు సూచిస్తున్న పరిష్కారాలు ఏమిటి? వారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఆశిస్తున్నారు? వారిపేర్లు, ఫోటోలు, బ్యాంకు ఖాతా వివరాలు మొదలైన వివరాలను జిల్లాలవారిగా సేకరించింది.
ఆ నివేదికల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 17,000 మంది కార్మికులు చేనేత, దాని అనుబంధ రంగంలో పనిచేస్తున్నట్లు స్పష్టం అయ్యింది. ఇప్పుడు వారి సమగ్ర సమాచారం ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ ఏడాది బడ్జెట్ లో చేనేత రంగానికి రూ. 1200 కోట్లు కేటాయించబడింది. కనుక వారి అవసరాలు తీర్చేవిధంగా ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించగలుగుతుంది.
ఒక్కో చేనేత కుటుంబానికి కనీసం నెలకు రూ.15,000 ఆదాయం వచ్చేవిధంగా ప్రణాళికలు సిద్దం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కనుక ఆలోగా వారి బ్యాంక్ ఖాతాలలో నెలకు కొంత మొత్తం ప్రత్యేక పెన్షన్ రూపంలో అందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వారికి ఆర్ధిక సహాయం అందించగలిగితే చాలా సంతోషమే. కానీ వారు తమ కాళ్ళపై తాము నిలబడి మరో నలుగురికి ఉపాధి చూపించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తే దాని వలన వారు తమ సమస్యల నుంచి శాశ్వితంగా బయటపడటమే కాకుండా సహాయం కోసం ఇంకా ప్రభుత్వంవైపు చూసే అవసరం ఉండదు.