తెరాసలో లుకలుకలు

తెలంగాణా ఉద్యమ సమయంలోనే చాలా ప్రజాధారణ పొందిన తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కారణంగా ప్రజలకు ఇంకా చేరువయిన మాట వాస్తవం. మరో రెండేళ్ళలో ఎన్నికలు రాబోతున్నందున రాష్ట్రంలో తెరాసను ఇంకా బలోపేతం చేసుకొనే ప్రయత్నాలలో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టింది. 

మహబూబ్ నగర్ లో నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపి జితేందర్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీనివస్ గౌడ్ మద్య నెలకొని ఉన్న విభేదాలు బయటపడ్డాయి. “నాకు మంత్రి పదవి దక్కకుండా మీరే (జితేందర్ రెడ్డి) అడ్డుకొన్నారని నాకు ఒక మంత్రి చెప్పారు,” అని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. 

ఆ వ్యాఖ్యలపై జితేందర్ రెడ్డి వెంటనే తీవ్రంగా స్పందించారు. “నేను అడ్డుపడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకొంటాను. మీకు ఆ మాట చెప్పిన మంత్రిని వెంటపెట్టుకొని వస్తే ముగ్గురం కలిసి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే ఈ విషయం తేల్చుకొందాము. అయినా ఎవరో ఏదో చెపితే ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మేస్తారని ఎలాగ భావించారు? కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో ఆదిత్యనాథ్ యోగిని కలిసినప్పుడు మీరే యూపికి ముఖ్యమంత్రి అవుతారని అన్నాను. అదే జరిగింది. కనుక ఎవరికైనా మంత్రి పదవి వ్రాసిపెట్టి ఉంటేనే దక్కుతుంది. అది దక్కనప్పుడు ఎవరినో నిందించడం సరికాదు,” అని జితేందర్ రెడ్డి జవాబిచ్చారు.

పార్టీని బలోపేతం చేసుకోవడం జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఇద్దరు సీనియర్ నేతలు ఈవిధంగా బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం విశేషం.