ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలను గ్రామ, పట్టణస్థాయిలో సమర్ధంగా అమలుచేయడంలో చాలా కీలకపాత్ర పోషించేవారు అంగన్ వాడీ కార్యకర్తలు. కానీ దశాబ్దాలుగా వారు నామమాత్రపు జీతాలతో వెట్టిచాకిరీ చేస్తున్నా వారిని ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి సమస్యలపై దృష్టిపెట్టి వారి జీతాలను రూ.4,500 నుంచి రూ.7,000 కు పెంచడమే కాకుండా వారి అందిస్తున్న సేవలకు ప్రతిగా వారికి టీచర్లుగా కొత్త గౌరవనీయమైన గుర్తింపు కల్పించింది. అలాగే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపులో కూడా ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. తెరాస సర్కార్ తీసుకొన్న ఈ నిర్ణయం వలన రాష్ట్రంలో 67,411 మంది అంగన్ వాడీ టీచర్లు లబ్ది పొందారు.
తెరాస సర్కార్ తమపట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించి తమ సమస్యలను తీర్చినందుకు అంగన్ వాడీ టీచర్ల సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత తెలిపాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నిజామాబాద్ ఎంపి కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెరాస సర్కార్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే సమాజానికి విశేష సేవలు అందిస్తున్న అంగన్ వాడీ టీచర్ల సమస్యలను తీర్చడం జరిగింది.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానావకాశాలు కల్పిస్తూ అందరూ సమానంగా ఎదగాలని కేసీఆర్ తపిస్తుంటారు,” అని అన్నారు.