ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ యోగి ఆదివారం మధ్యాహ్నం లక్నోలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో బాటు 43మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. చివరి క్షణం వరకు ముఖ్యమంత్రి రేసులో ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. ఈరోజు ప్రమాణస్వీకారం చేసినవారిలో 22 మంది క్యాబినెట్ మంత్రులు, 12మంది జూనియర్ మంత్రులు, 9మంది సహాయ మంత్రులు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి భాజపాలో చేరిన రీటా బహుగుణతో సహా మొత్తం ఆరుగురు మహిళలకు మంత్రి పదవులు దక్కాయి. లక్నోలోని కాన్షీరాం మైదానంలో జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యూపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.