మహాజన పాదయాత్ర అలా ముగిసింది

తెలంగాణా సిపిఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో గత ఏడాది అక్టోబర్ 17న రంగారెడ్డిజిల్లా ఇబ్రహీం పట్టణంలో మొదలుపెట్టిన మహజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం సరూర్ నగర్ వద్ద సమరసమ్మేళన బహిరంగసభ జరిగింది. ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సిపిఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు, అన్ని జిల్లాల నుంచి వేలాదిగా కార్యకర్తలు, కార్మికులు,విద్యార్ధులు, మహిళలు, రైతులు ఈ బహిరంగ సభకు హాజరయ్యారు.         

154 రోజులు ఏకధాటిగా సాగిన మహాజన పాదయాత్రలో 29 జిల్లాలలోని 1500 గ్రామాల గుండా మొత్తం 4,150 కిమీ సాగింది. సిపిఐ(ఎం) పాదయాత్రకు అన్ని చోట్ల ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో అదే ఉత్సాహంతో నేడు జరిపిన బహిరంగ సభ నిర్వహించారు. అది కూడా విజయవంతం అవడంతో  ఆ పార్టీ నేతలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు సభలో మాట్లాడిన వక్తలు అందరూ తెరాస, ప్రధాని నరేంద్ర మోడీల తీరు, వారి పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరువురూ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రజలను మతాలవారిగా చీల్చుతుంటే, కేసీఆర్ సర్కార్ ప్రజలను కులాలవారిగా చీల్చుతోందని విమర్శించారు. ఓట్ల కోసమో, రాజకీయాలు చేయడం కోసమో తాము పాదయాత్ర చేయలేదని, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడేందుకే చేశామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడినప్పటికీ, నేటికీ వివిధ వర్గాల ప్రజల జీవనస్థితిగతులలో ఎటువంటి మార్పు రాలేదని అది తెరాస సర్కార్ వైఫల్యమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.