ప్రధాని నరేంద్ర మోడీ మొదలు రాష్ట్ర రాజకీయ నేతల వరకు అందరూ బాహుబలిని వాడేసుకొంటూ రాజకీయాలకు మంచి మసాలా, కామెడీ ఎలిమెంట్స్ జోడించి ఆర్ట్ ఫిలిం వంటి రాజకీయాలను మంచి కమర్షియల్ ఫిలింలాగ మార్చేశారు. దానితో సామాన్య ప్రజలు కూడా వారి బాహుబలి ముచ్చట్లు వింటున్నారు.
బాహుబలి సినిమాలాగే సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మొదలుపెట్టిన ఈ బాహుబలి ముచ్చట్లు కూడా సూపర్ హిట్ అయిపోయాయి. ‘కాంగ్రెస్ పార్టీలో ఉద్భవించబోయే బాహుబలి వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను ఓడించబోతున్నాడు,” అని ఆయన చేసిన వ్యాఖ్యపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీలో బాహుబలి పుట్టే అవకాశం లేదు కానీ తప్పకుండా బఫూన్లు పుట్టే అవకాశాలున్నాయి. కేసీఆర్ ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎప్పుడో బాహుబలి ఉద్భవిస్తాడని జానారెడ్డి చెప్పడం చూస్తే ప్రస్తుతం ఆ పార్టీలో కేసీఆర్ ని ఎదుర్కోగలవారు ఎవరూ లేరని తేలిపోయింది. ఇక వాళ్ళ వల్ల ఏమీ కాదని గ్రహించినందునే బాహుబలి వస్తాడని జోస్యం చెప్పుకొని తృప్తిపడుతున్నాట్లున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో బఫూన్లు మాత్రమే వస్తారు. ఎంతమంది బాహుబలిలు, కాటమరాయుళ్ళు కట్టకట్టుకువచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏమీ చేయలేరు. కేసీఆర్ ముందు వాళ్ళు వేసే కుప్పిగంతులతో ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇక ముగిసిపోయినట్లే. దేశంలోని సకల దరిద్రాలకు కాంగ్రెస్ పార్టీయే మూలం. ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నవారైనా ఆ పార్టీలో చేరబోరు. చంద్రబాబు నాయుడు మూటాముల్లె సర్దుకొని రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోవడంతోనే తెదేపా దుఖాణం బంద్ అయిపోయింది. వామపక్షాలు ఉన్నా లేనట్లే లెక్క,” అని అన్నారు.
జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పినందున, కేటిఆర్ కూడా సినిమా బాషలోనే జవాబు చెప్పారు.