కార్ రేసింగ్ లో పాల్గొనే వ్యక్తి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం లేదా మరణిస్తుండటం సహజమే. కానీ భారత ప్రొఫెషనల్ రేసర్ అశ్విన్ సుందర్ తన భార్యతో కలిసి మామూలు కారులో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన చెట్టు గుద్దుకొని ఇద్దరూ అగ్నికి ఆహుతి అయ్యి చనిపోవడం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తుంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చెన్నై సమీపంలోని శాంతం అనే ప్రాంతంలో జరిగింది.
అశ్విన్ సుందర్ తన భార్య నివేదితతో కలిసి తమ బి.ఎం.డబ్ల్యూ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అది అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును డ్డీకొనడంతో మంటలు చెలరేగాయి. కారు తలుపులు ఆటోమేటిక్ గా లాక్ అయిపోయినందున వారిరువురూ ఎంత ప్రయత్నించినా దానిలో నుంచి బయటపడలేకపోయారు. ఈ ప్రమాదంలో వారిరువురూ సజీవదహనం అయ్యారు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అశ్విన్ సుందర్ 2012, 2013 సం.లలో ఎఫ్-4 క్యాటిరీలలో ఛాంపియన్ గా నిలిచాడు. అతని భార్య స్థానిక ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేసేవారు.