మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పంజాబ్ ఎన్నికలకు ముందు చిత్రవిచిత్రమైన రాజకీయ గేమ్స్ చాలా ఆడి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి పంజాబ్ మంత్రి అయిపోయాడు. అదే అయన భాజపానే నమ్ముకొని ఉండి ఉంటే ఎంపిగానే ఉండిపోయేవాడు. పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అయినా అవ్వాలని సిద్దూ కలలుకన్నాడు. అందుకే భాజపాను వీడి ‘ఆవాజ్ ఏ పంజాబ్’ అనే స్వంత కుంపటి పెట్టుకొని అన్ని పార్టీలతో బేరాలాడుకొని చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. సిద్ధూ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవెంటనే సభలో బహిరంగంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కు పాదాభివందనం చేసి కృతజ్ఞత చాటుకొన్నాడు. కానీ అందుకు ప్రతిగా సిద్దూకి ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందనుకొంటే పర్యాటక మరియు సాంస్కృతిక శాఖను ఇచ్చి సర్దుకుపోమనడంతో తీవ్ర నిరాశకు, అసంతృప్తితో రగిలిపోతున్నాడు.
సిద్దూ చాలా తెలివిగా పావులు కదిపి మంత్రి అవగలిగినప్పటికీ, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఏవిధంగా ఉంటాయో మొదటిసారి రుచి చూశాడు. కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి వచ్చే వరకు సిద్దూని ప్రసన్నం చేసుకొనేందుకు చాలా కష్టపడింది. అధికారంలోకి వచ్చిన తరువాత అతనికి అప్రదాన్యమైన పదవినిచ్చి చేతులు దులుపుకొంది. దాని తీరు ఎలా ఉంది అంటే ‘ఏరు దాటే వరకు ‘ఓడ మల్లన్న..దాటేక బోడి మల్లన్న’ అన్నట్లుంది. మరి ఈసారి సిద్దూ ఏ కొత్త గేమ్ మొదలుపెడతాడో చూడాలి. అయితే సిద్దూ వంటి పాపులర్ వ్యక్తికి తగిన శాఖే లభించిందని చెప్పవచ్చు. సిద్దూ మనసుపెట్టి పనిచేస్తే ఆ శాఖ వలన అతను మరింత పాపులర్ అవుతారు. అలాగే అతని సేవల వలన పంజాబ్ గొప్పదనం గురించి మరింతగా అందరికీ తెలుస్తుంది.