కేసీఆర్ జబర్దస్త్ ప్రతిజ్ఞ

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న శాసనసభలో మరో జబర్దస్త్ ప్రతిజ్ఞ చేశారు. వచ్చే 9 నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇవ్వలేకపోతే, వచ్చే ఎన్నికలలో తాము ప్రజలను ఓట్లు అడుగబోమని అన్నారు. హైదరాబాద్ లోనే ఏకంగా లక్ష ఇళ్ళు, మిగిలిన జిల్లాలలో అన్ని గ్రామాలలో కలిపి మరో లక్ష ఇళ్ళు నిర్మించి చూపిస్తామని కేసీఆర్ చెప్పారు. అవి కూడా నాసి రకంగా కాకుండా అత్యుత్తమ నాణ్యతతో గతః ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ కంటే చాలా అద్భుతంగా నిర్మించి చూపిస్తామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 30,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం చాలా జోరుగా సాగుతోందని, త్వరలోనే మిగిలినవి కూడా మొదలుపెడతామని చెప్పారు. వీటికి నిధుల కొరత లేదని చెప్పారు. 

కేసీఆర్ చేసిన ఈ తాజా ప్రతిజ్ఞపై ప్రధాన ప్రతిపక్ష నేత కె జానారెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. “కేసీఆర్ కనీసం వచ్చే ఎన్నికల నాటికి కూడా అన్ని ఇళ్ళు కట్టించి ఇవ్వలేరు. ఆయన ప్రజలకు ఆశలు కల్పించి ఓట్లు దండుకోవడానికే అటువంటి తీయటి మాటలు చెపుతుంటారు. కొన్ని మోడల్ హౌసులు నిర్మించి వాటిని పేదలకు చూపించి వచ్చే ఎన్నికలలో తమకే ఓట్లు వేస్తే అటువంటి ఇళ్ళను నిర్మించి ఇస్తానని ఆశపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను కొట్టడానికి ఒక బాహుబలి వచ్చే అవకాశం ఉంది. అతని చేతిలోనే కేసీఆర్ ఓదిపోవడం ఖాయం. అంతవరకు కేసీఆర్ ఇలాగే ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేయవచ్చు. పేద ప్రజలకు లేనిపోని ఆశలు కలిగించి అధికారంలోకి రావాలనుకొంటే వారే ఆయనకు తగిన గుణపాఠం చెపుతారు,” అని జానారెడ్డి అన్నారు.