సమంతకు కేటిఆర్ అభినందనలు

టాలీవుడ్ అందాలభామ సమంత రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి మెరుగుపరిచేందుకు, చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సేవలు అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈనెల 10వ తేదీన పోచంపల్లి, దుబ్బాక ప్రాంతాలలో పర్యటించి అక్కడి చేనేత కార్మికులను కలిసి వారి కష్టనష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అలాగే వారి తయారు చేస్తున్న చేనేత వస్త్రాలను కూడా పరిశీలించారు. వారి నుండి పూర్తి వివరాలు సేకరించిన తరువాత ఆమె మంత్రి కేటిఆర్ ను కలిసి వాటిని ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేటిఆర్ ఆమెకు చెప్పారు. అనంతరం ఆమెను అభినందిస్తూ ట్విట్టర్ లో ఒక మెసేజ్ కూడా పెట్టారు.  దానితో బాటు ఆమె పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా కేటిఆర్ పోస్ట్ చేశారు.