ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విజయం సాధించిన భాజపా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ను ఎంపిక చేసింది. ఈరోజు డెహ్రాడూన్ లో పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొన్నారు. 

త్రివేంద్ర సింగ్ రావత్ మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2014లో భాజపాలో చేరి సార్వత్రిక ఎన్నికలలో అమిత్ షాతో కలిసి ఉత్తరప్రదేశ్ లో పనిచేశారు. మళ్ళీ ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలలో కూడా త్రివేంద్ర సింగ్ రావత్ పార్టీ విజయం కోసం చాలా శ్రమించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయడం, అధిష్టానం పట్ల వినయవిధేయతలు కనబరచడం వంటి లక్షణాలే ఆయనకు ముఖ్యమంత్రి పదవి తెచ్చి పెట్టాయని చెప్పవచ్చు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో సన్నిహితంగా పనిచేయడం కూడా ఆయనకు కలిసివచ్చింది. రేపు డెహ్రాడూన్ లో ఆయన ముఖ్యమంత్రిగా, మరికొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు హాజరవుతారని సమాచారం.