సింగరేణి కోసం సుప్రీంకోర్టుకు వెళ్దాం: కేసీఆర్

సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల కోసం తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను నిన్న హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాష్ట్ర అడ్వకేట్ జనరల్, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యి దానిపై చర్చించిన తరువాత సింగరేణి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో ఈకేసును వాదించడానికి కార్మిక చట్టాలలో నిష్ణాతులైన ఇద్దరు న్యాయవాదులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యావత్ దేశానికి వెలుగులు నింపుతున్న సింగరేణి కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది కనుక ఈ కేసులో ఎట్టి పరిస్థితులలో వెనక్కు తగ్గకుండా గట్టిగా పోరాడాలని సూచించారు.

సింగరేణిలో వారసత్వ నియామకాలు చేపట్టడం వలన తమ వంటి నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది కనుక ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ గోదావరిఖనికి చెందిన సతీష్ అనే నిరుద్యోగి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆయన వాదనతో ఏకీభవించిన హైకోర్టు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులను నిలిపివేసింది. 

ఈ వారసత్వ నియామకాల వలన సుమారు 26,000 మందికి పైగా కార్మికులు ప్రయోజనం పొందుతారని అంచనా. అంటే ఆ మేరకు నిరుద్యోగులు నష్టపోయినట్లేనని భావించవచ్చు. కానీ సింగరేణి కార్మికుల కుటుంబ, ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా దయనీయంగానే ఉన్నాయి కనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. కానీ దాని వలన నిరుద్యోగులకు నష్టం కలుగుతోంది కనుక వివిధ ప్రభుత్వ శాఖలలో ఆమేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయగలిగితే బహుశః ఇటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవకపోవచ్చు. ఒకవేళ వ్యక్తం అయినా తెరాస సర్కార్ న్యాయస్థానాలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోగలుగుతుంది.