తెరాస సర్కార్ కు జానారెడ్డి చురకలు

కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి శాసనసభలో నిన్న బడ్జెట్ పై జరిగిన చర్చలో మాట్లాడుతూ తెరాస సర్కార్ చేస్తున్న మంచి పనులకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెపుతూనే చురకలు కూడా వేశారు. 

“తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సప్తసముద్రాలు కూడా దాటిపోయింది. సర్కార్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. బడ్జెట్ లో అంకెలను పెంచేసి ప్రజలను మభ్యపెట్టగలరేమో కానీ వాటితో అభివృద్ధి సాధ్యం కాదు. ఈ బడ్జెట్ చాలా అద్భుతం..దానితో ఏవో అద్భుతాలు జరిగిపోబోతున్నయన్నట్లు మీరు చాలా హడావుడి చేశారు. బడ్జెట్ లో లోటు ఉన్నప్పుడు మిగులు ఎలా సాధ్యం? అంకెల గారడీ చేసి దానిని కనబడకుండా కప్పిపుచ్చినంత మాత్రాన్న ఆ లోటు పూడుకుపోతుందా? అటువంటి బడ్జెట్ తో ఏవిధంగా అద్భుతాలు సాధిస్తారు?” అని ప్రశ్నించారు.

జానారెడ్డి తన ప్రసంగం కొనసాగిస్తూ, “గత ఏడాది మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మీ లెక్కలు తప్పు అని అప్పుడే చెప్పాను. ప్రభుత్వానికి సుమారు 46,000 కోట్లకు మించి ఆదాయం రాకపోవచ్చునని చెప్పాను. కానీ మీరు వినకుండా బారీగా బడ్జెట్ ప్రవేశపెట్టేశారు. ఆ తరువాత నేను చెప్పినట్లే తక్కువ ఆదాయం రావడంతో మళ్ళీ బడ్జెట్ అంచనాలను సవరించారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం అదే తప్పు చేస్తోంది. ఈసారి రూ.52,000 కోట్లు వరకు ప్రభుత్వ ఆదాయం ఉండవచ్చు. కానీ మీరు రూ.65,000లు రావచ్చనే అంచనాలతో బడ్జెట్ రూపొందించుకొన్నారు. కనుక ఈసారి కూడా మళ్ళీ అభివృద్ధి, సంక్షేమ పధకాలకు కేటాయించిన నిధులలో కోతలు పెట్టక తప్పదు. లోటు ఉన్నప్పుడు నిజాయితీగా దానిని అంగీకరించి తదనుగుణంగా బడ్జెట్ రూపొందించుకొంటే ఇటువంటి సమస్యలు తలెత్తవు. కానీ మీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికే ఈవిధంగా బడ్జెట్ తయారు చేసింది. దాని వలన రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం పొంచి ఉంది,” అని అన్నారు.

“మీ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోందని గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ 2013-14 సం.లలో 107 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తులు ఉండగా, మీ ప్రభుత్వం హయంలో 2014-15 సం.లలో 72 లక్షల టన్నులు, 2015-16 సం.లలో 51 లక్షల టన్నులకు ఎందుకు పడిపోయింది?” అని జానారెడ్డి ప్రశ్నించారు. 

జానారెడ్డి తన ప్రసంగం ముగిస్తూ చివరిగా చెప్పిన మాటలు అందరినీ నవ్వులలో ముంచెత్తాయి. “ఒకప్పుడు మేము కూడా మీలాగే ఆర్భాటపు ప్రకటనలు, హడావుడి చేశాం. తత్ఫలితంగానే ప్రజలు మమ్మల్ని ఈ ప్రతిపక్ష బెంచీలలో కూర్చోబెట్టారు. మీరు కూడా అదే తప్పు చేయవద్దని సూచిస్తున్నాను,” అని అన్నారు.