గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జి.హెచ్.ఎం.సి. మొత్తం 109 క్యాంటీన్లు నడిపిస్తోంది. మున్సిపల్ మంత్రి కేటిఆర్ వాటికి ‘అన్నపూర్ణ సెంటర్స్’ గా నామకరణం చేశారు. వాటిలో కేవలం ఐదు రూపాయలకే చాలా రుచికరమైన భోజనం లభిస్తుంది. నగరంలో నిరుపేదలు, రోజువారి కూలీ పనులు చేసుకొనేవారికి అందుబాటు ధరలలో ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ అన్నపూర్ణ సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి కేటిఆర్ చెప్పారు. పరిశుబ్రమైన వాతావరణంలో తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడమే తమ లక్ష్యం అని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన అన్నపూర్ణ సెంటర్స్ లో రోజుకు సుమారు 22,000 మంది వరకు ఉపయోగించుకొంటున్నారని తెలిపారు. ఒక్కో భోజనంకు రూ.24.25 ఖర్చు అవుతుందని కానీ దానిలో జి.హెచ్.ఎం.సి. రూ.19.25 భరించి కేవలం ఐదు రూపాయలకే పేదలకు ఆహారం అందిస్తోందని కేటిఆర్ చెప్పారు.
ఈ అన్నపూర్ణ సెంటర్స్ పై రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో సభ్యులు పలు సూచనలు చేశారు. భోజనంతో పాటు మంచి నీళ్ళు కూడా ఉచితంగా అందించాలని కోరారు. ఎందుకంటే, భోజనం కేవలం ఐదు రూపాయలకే అందిస్తున్నప్పటికీ, ఒక్కో మంచి నీళ్ళ ప్యాకెట్ కు రెండు రూపాయలు వసూలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే కృష్ణారావు చెప్పారు. ఇవి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతోనే ప్రారంభించబడ్డాయి కనుక అన్ని చోట్ల తప్పనిసరిగా ఆయన ఫోటోలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ అన్నపూర్ణ సెంటర్స్ కోసం శాశ్విత ప్రాతిపదికన అన్ని హంగులతో కూడిన భవనాలు నిర్మించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కోరారు. పేదలు ఎక్కువగా నివసించే బోయినపల్లి, బొల్లారం హాస్పిటల్, ఖార్ఖాన తదితర ప్రాంతాలలో, అలాగే కంటోన్మెంట్ ఏరియాలో కూడా ఈ అన్నపూర్ణ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ఎమ్మెల్యే జి సత్యనారాయణ కోరారు.
ఇటువంటి సంక్షేమ పధకాలు ప్రారంభించడం చాలా హర్షణీయమే. కానీ వాటిని విజయవంతంగా చిరకాలం నిర్వహించడమే చాలా కష్టం. ఎందుకంటే వీటి నిర్వహణ జి.హెచ్.ఎం.సి.కి చాలా ఆర్ధికభారమే అవుతుంది. పైగా క్యాంటీన్లకు పప్పులు, కూరగాయలు, నూనె, పంచదార వంటి పదార్ధాల కొనుగోలు, వాటితో నాణ్యమైన వంటల తయారీ, సరఫరా తదితర పనులకు అనేకమంది ఉద్యోగులు నిరంతరం పనిచేయచేయవలసి ఉంటుంది. వారిపై పర్యవేక్షణ, వారి జీతభత్యాలు వగైరాలు కూడా ఉంటాయి. ఇక అవినీతి జాడ్యం ఉందనే ఉంటుంది. కనుక ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చాలా సమర్ధమైన యంత్రాంగం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే ఈ పధకం విజయవంతం అవుతుంది. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెడుతుంది.