పాపం సింగరేణి కార్మికులు..

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం కలలు కంటున్నారు. వారి కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. కనీసం రెండేళ్ళ సర్వీసు కలిగి ఉండి 48-58 మద్య ఏళ్ళ వయసున్న కార్మికులు తమ ఉద్యోగాలను తమ వారసులకు ఇచ్చుకొనేందుకు అనుమతించారు. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడన్నట్లుగా హైకోర్టు ఆ నిర్ణయానికి బ్రేక్ వేసింది. 

గోదావరిఖనికి చెందిన సతీష్ అనే ఒక నిరుద్యోగి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు నేడు తీర్పు చెప్పింది. పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్ళీ కొత్తగా మరో నోటిఫికేషన్ జారీ చేసి సింగరేణిలో నియామకాలు జరపాలని ఆదేశించింది. వారసత్వ ఉద్యోగాలపై తన ఆదేశాలను తక్షణం అమలులోకి వస్తాయని తేల్చి చెప్పింది. కనుక సింగరేణి యాజమాన్యం వారసత్వ నియమకాలు కొనసాగించకుండా నిలిపివేయాలని ఆదేశించింది. కానీ అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేసిన కార్మికులకు మాత్రం హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. వారు తమ వారసులకు తమ ఉద్యోగాలు బదిలీ చేసుకోవచ్చని చెప్పింది. 

అనారోగ్య కారణాలతో తమ ఉద్యోగాలను వారసులకు బదిలీ చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, దానికి అనేక పరిమితులు విదించవచ్చు. కనుక ఇది సింగరేణి కార్మికులకు చాలా నిరాశ కలిగించే విషయమే. ప్రాజెక్టుల కోసం జరుగుతున్న భూసేకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కోర్టులో 34 కేసులు దాఖలు చేసింది. కనుక దీనిలో కూడా కాంగ్రెస్ హస్తం ఉందేమోనని అనుమానించక తప్పదు. ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ ఈ పిటిషన్ వేయించి ఉండి ఉంటే దానిని సింగరేణి కార్మికులు ఎన్నటికీ క్షమించబోరు.

సింగరేణి కార్మికులకు ఎదురైనా ఈ కొత్త సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆరే మళ్ళీ ఏదో విధంగా పరిష్కారం చూపుతారని ఆశిద్దాం.