ఏపిలో జనసేన పరిస్థితి ఏమిటి?

వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలలో పోటీ చేయబోతోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు ఆంధ్రాలో చాలా మంది అభిమానులు ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తమ్ముడికి అండగా నిలబడతామని నాగబాబు చెప్పారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండదలిస్తే మెగాభిమానులలో చీలికలు ఉండవు కనుక అప్పుడు అందరూ కూడా జనసేనకే మద్దతు ప్రకటించవచ్చు. ఇది జనసేనకు చాలా కలిసి వచ్చే అంశమే. కానీ అది తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్ పార్టీలను డ్డీకొనవలసి ఉంటుంది. ఏపిలో తెదేపా, వైకాపాలు చాలా బలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికలు ఆ రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యవంటివే. కనుక వాటిని తట్టుకొని జనసేన నిలబడగలదో లేదో ఇప్పుడే చెప్పలేము. 

జనసేన ఎన్నికల బరిలోకి దిగితే ఏమవుతుంది? అని ఆలోచిస్తే విజయం సాధించలేకపోయినా ఖచ్చితంగా ఓట్లను చీల్చగలుగుతుందని చెప్పవచ్చు. దాని వలన ఎవరికి నష్టం..ఎవరికి లాభం కలుగుతుంది? అంటే తెదేపాకు లాభం వైకాపాకు నష్టం కలిగే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. (జగన్ కూడా తెదేపా ఓట్లను చీల్చేందుకే ముద్రగడ పద్మనాభాన్ని ముందుకు తీసుకువచ్చి ఆయన చేత ఉద్యమాలు చేయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.)  

పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం వరకు తెదేపా-భాజపాలకు సన్నిహితుడుగా మెలిగారు. కానీ వాటిలో భాజపాకు దూరం జరిగి తెదేపాతో దోస్తీ కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలు కలిసిపోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వాటిలో ఒకదానితో దోస్తీ మరొకదానితో దుష్మనీ మెయిన్ టెయిన్ చేయడం సాధ్యం కాదు కనుక తెదేపాకు కూడా దూరం కావలసి ఉంటుంది. తెదేపాకు దూరంగా జరిగినట్లయితే అప్పుడు అది కూడా జనసేనపై విరుచుకుపడటం ఖాయం. 

“అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే’ అనే మాటకు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండదలచుకొన్నట్లయితే, అటువంటి పార్టీ తరపున పోటీ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? ఈ ఏడాది జూన్ నుంచి జనసేన పార్టీ నిర్మాణం మొదలుపెడతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు కనుక పార్టీ కార్యవర్గం ఏర్పాటు అయితే జనసేన వైఖరి, విధివిధానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.