తెలంగాణాలో ఎవరైనా కొత్త పార్టీలు పెట్టుకోవచ్చని మంత్రి కేటిఆర్ చెప్పిన మరునాడే..అంటే నిన్ననే బహుజన రాజ్యాధికార పార్టీ (బి.అర్.పి.)అనే ఒక కొత్త పార్టీ స్థాపించబడటం విశేషం. దానికి నల్లా సూర్యప్రకాష్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి బిసి సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య ఇంకా పలువురు ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బి.అర్.పి. అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ, “బిసిల సంక్షేమం, వారికి రాజ్యాధికారం కల్పించడమే ప్రధాన లక్ష్యాలుగా ఈ పార్టీని ఏర్పాటు చేశాము. త్వరలోనే పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ లో బారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాము. అప్పుడే మన పార్టీ జెండా, చిహ్నం, నినాదం వగైరా అన్నీ అవిష్కరిస్తాము. చిరకాలంగా బిసిల సంక్షేమం కోసం పోరాడుతున్న మన ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా చేసుకోగలిగినప్పుడే మనకు పూర్తి న్యాయం జరుగుతుంది,” అని అన్నారు.
ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ “రాష్ట్ర జనాభాలో బిసిల శాతమే చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, 1-4 శాతానికి మించని ఇతర కులాలవారే రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. బీసిలలో ఐఖ్యత లోపించినందునే ఇతరులు మనపై అధికారం చలాయించగలుగుతున్నారు. ఎన్నికల సమయంలో ముస్లింలు కనబరిచే ఐఖ్యతను మనమూ కనబరచగలిగినప్పుడే మనం ఒక బలీయమైన శక్తిగా ఎదుగగలుగుతాము,” అని అన్నారు.