సాధారణంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ధర్నా చేసే ప్రాంతాన్ని, నిరసన తెలిపే హక్కును కాపాడుకోవడం కోసం పోరాడవలసి వస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ వద్ద గల ‘ధర్నా చౌక్’ ను రాష్ట్ర ప్రభుత్వం నగర శివార్లలోకి తరలించడాన్ని నిరసిస్తూ నేడు భాజపా నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయబోతున్నారు.
ఇదే అంశంపై చర్చించడానికి టిజెఎసి, దాని అనుబంధ సంఘాలు, వామ పక్షాలు, వివిధ ప్రజా సంఘాల నేతలు నిన్న నగరంలోని మఖ్దూం భవన్ లో రౌండ్ టేబిల్ సమావేశంనిర్వహించాయి. దానిలో మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరామ్, చాడా వెంకట్ రెడ్డి, ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశర రావు, యు. సాంభశివరావు, కే.గోవర్ధన్ తదితర వక్తలు అందరూ తెరాస సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఉద్యమాలతో గుర్తింపు, అధికారం సంపాదించుకొన్న కేసీఆర్ ఇప్పుడు ప్రజల గొంతునొక్కే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. డజన్ల కొద్దీ కార్లతో సాగే ముఖ్యమంత్రి కాన్వాయ్ నగరంలో తిరుగుతున్నప్పుడు ట్రాఫిక్ సమస్యల గురించి ఆలోచించని ప్రభుత్వం, ఇందిరా పార్క్ లో ధర్నాల వలన ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందనే సాకుతో ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధర్నా చౌక్ అనేక ఉద్యమాలకు కేంద్రంగా నిలిచిన చారిత్రికమైన ప్రదేశమని దానిని తరలించాలని చూస్తే సహించబోమని వక్తలు హెచ్చరించారు. ఒకవేళ తరలిస్తే ఇక నుంచి ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ ముందు, సంబంధిత శాఖల కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 16న గవర్నర్ నరసింహన్ ను కలిసి దీని కోసం వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 20 వరకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమావేశాలు నిర్వహించి, 21న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన నిర్ణయం ఉపసంహరించుకొనే వరకు ధర్నా చౌక్ ను కాపాడుకొనేందుకు పోరాటాలు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు.