తెరాస సర్కార్ లో అదే లేదుట!

రాష్ట్రంలో ప్రతిపక్షాలు తెరాస సర్కార్ చేసే ప్రధాన ఆరోపణ ప్రభుత్వంలో అవినీతి ఏరులై పారుతోందని. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రభుత్వంలో కుంభకోణాలు..లంబకోణాలు లేవని గట్టిగా వాదించారు. 

గవర్నర్ నరసింహన్  ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ “మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా పని చేస్తోంది. అవినీతిరహితమైన పాలన సాగిస్తున్నాము. ప్రభుత్వంలో ఎంతటివారైన సరే అవినీతికి పాల్పడితే సహించబోము. ప్రతిపక్షాలు మా ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. మా ప్రభుత్వం టిఎస్ ఐపాస్ విధానంలో పరిశ్రమలకు కేవలం 15 రోజులలోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నాము. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మైక్రోమాక్స్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించడానికి రెండున్నరేళ్ళు పడితే మన రాష్ట్రంలో మూడు నెలలోనే ఉత్పత్తి ప్రారంభించగలిగింది అంటే మన ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, వేగంగా, అవినీతిరహితంగా పనిచేస్తోందో అర్ధం చేసుకోవచ్చు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు విషయంలో కూడా తెరాస నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలుగజేసుకోవడం లేదు. వారు గ్రామాల ఎంపికకే పరిమితం అవుతున్నారు. అధికారులే అర్హులైన వారిని గుర్తించి ఇళ్ళు కేటాయిస్తున్నారు. మా ప్రభుత్వం రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే పెద్ద లక్ష్యం పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టులు చేపడుతుంటే, కాంగ్రెస్ నేతలు సాంకేతిక కారణాలు సాకుగా చూపిస్తూ వాటిపై కోర్టులలో కేసులు వేసి అడ్డుకొంటున్నారు. వాళ్ళు మొత్తం 32 కేసులు వేశారు. కానీ వారు ఎన్ని అవరోధాలు సృష్టించినా మేము తెలంగాణాలో ప్రతీ ఎకరాకు నీళ్ళు అందించి తీరుతాము,” అని కేసీఆర్ అన్నారు.