టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మళ్ళీ నిన్న తెరాస సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్ లో సుందయ్య విజ్ఞానకేంద్రంలో నిన్న జరిగిన రైతు జెఎసి సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, “తెలంగాణా రాష్ట్రంలో ఈ మూడేళ్ళలో ఆర్దికసమస్యల కారణంగా 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణా దేశంలో 2వ స్థానంలో ఉంది. వివిద కారణాల చేత రైతులకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోతుంటే తెరాస సర్కార్ ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యింది. పొరుగునే ఉన్న కర్నాటక ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరను అందించేందుకు తన బడ్జెట్ లో రూ.450 కోట్లు కేటాయించింది. తెలంగాణా ప్రభుత్వం కూడా అదే విధంగా బడ్జెట్ లో కేటాయించాలి. రైతులు అష్టకష్టాలు పడుతున్నా తెరాస సర్కార్ మాటలకే పరిమితం అవుతోంది తప్ప వారిని ఆదుకోవడం లేదు. పైగా ప్రాజెక్టుల పేరు చెప్పి వారి భూములను కూడా బలవంతంగా గుంజుకొంటోంది. అటు కేంద్రమూ ఆదుకోక ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ రైతులను ఆదుకోకపోతే వారు తమ కష్టాలను ఎవరికి మోర పెట్టుకోవాలి? అని ప్రశ్నించారు.