తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ పై ప్రభుత్వ, ప్రతిపక్ష వాదనలు పూర్తి భిన్నంగా సాగుతున్నాయి. అది సహజం కూడా. మిగులు బడ్జెట్ తో చేతికి అందిన రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి కేటిఆర్ ఘాటుగా సమాధానం చెప్పారు.
“దేశంలో అనేక రాష్ట్రాల కంటే తెలంగాణా వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర ఆర్ధికశాఖ గణాంకాలతో సహా వివరించింది. వృద్ధిరేటు బాగుంది కనుకనే రాష్ట్ర పరపతి కూడా బాగా ఉంది. కనుక ఆ అప్పులను తిరిగి చెల్లించగల శక్తి మన రాష్ట్రానికి ఉందని ఆర్ధికసంస్థలు భావిస్తునందునే మనకు అప్పులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.
రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు తీసుకోవడం నేరం కాదు. దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఉదా: గుజరాత్ బడ్జెట్ రూ.1.51లక్షల కోట్లు. దానికి 1.65 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. మహారాష్ట్ర బడ్జెట్ రూ.2.65 లక్షల కోట్లు. దానికి రూ.1.35 లక్షల కోట్లు అప్పులు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.1.35 లక్షల కోట్లు, అప్పులు రూ.1.90 లక్షల కోట్లు ఉన్నాయి.
ఈవిధంగా చాలా అభివృద్ధి చెందిన, చెందుతున్న రాష్ట్రాలు కూడా అప్పులు తీసుకొంటూనే ఉన్నాయి. మా ప్రభుత్వం తీసుకొంటున్న రుణంలో ప్రతీ పైసా కూడా తెలంగాణా అభివృద్ధికే ఖర్చు చేస్తున్నాము. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందితే ఈ అప్పులను తీర్చడం ఒక లెక్క కాదు. ఈ అప్పుల భారాన్ని మేము ప్రజల నెత్తిన రుద్దబోము. వాటిని తీర్చే బాధ్యత మాదే.
దశాబ్దాల పాటు సాగిన కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు, నిరంతరం విద్యుత్ సంక్షోభం, అవినీతి తప్ప ఏమి వేరేమి కనబడింది? కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ప్రకటిస్తే, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి హాలీడేస్ ఇచ్చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తున్నంత కాలం ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఇంకా దిగజారిపోయినా ఆశ్చర్యం లేదు.
ఇక భాజపా రాష్ట్రంలో బలపడి వచ్చే ఎన్నికలలో మాకు గట్టి పోటీ ఇవ్వాలనుకొంటే మేము దానిని స్వాగతిస్తాము. అలాగే ఇంకా ఎవరైనా (ప్రొఫెసర్ కోదండరామ్) కొత్త పార్టీలు పెట్టుకోవాలనుకొన్నా మాకేమి అభ్యంతరాలు లేవు. కానీ వచ్చే ఎన్నికలలో తెరాసయే తప్పకుండా విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను,” అని మంత్రి కేటిఆర్ అన్నారు.