నేడు ఏపి సర్కార్ 2017-18 రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టబోతోంది. అమరావతిలోని వెలగపూడిలో నిర్మించుకొన్న శాసనసభ, మండలి భవన సముదాయాలు కీలకమైన ఈ బడ్జెట్ సమావేశాలతోనే ప్రారంభం కావడం విశేషం.
ఈరోజు ఉదయం 10.25 గంటలకు ఏపి ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి కూడా ఏపి బడ్జెట్ చాలా బారీగానే ఉండబోతున్నట్లు సమాచారం. అది సుమారుగా రూ.1, 55, 896 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. కానీ ఒకపక్క బారీగా రెవెన్యూలోటు ఉన్నప్పుడు అంత బారీ బడ్జెట్ ను రూపొందించుకోవడం విమర్శలకు తావిస్తుంది. చేతిలో తగినంత డబ్బు లేకపోయినా, అభివృద్ధి, సంక్షేమ పధకాలకు బడ్జెట్ లో బారీగా కేటాయింపులు జరుపడం, ఆ కారణంగా బారీ బడ్జెట్ ప్రకటించడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ప్రతిపక్షాలు విమర్శించక మానవు.
స్వర్గీయ భూమానాగిరెడ్డి సంతాప కార్యక్రమంపై తెదేపా, వైకాపాలు రాజకీయం చేసుకొని పరస్పరం దూషించుకొంటున్నాయి. కనుక బడ్జెట్ సమావేశాలలో మొదట ఆ విషయంపైనే మళ్ళీ రెండు పార్టీల మద్య గొడవ జరిగే అవకాశం కనబడుతోంది. ఏపి బడ్జెట్ సమావేశాలు ఈనెలాఖరు వరకు కొనసాగుతాయి.