గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పార్రికర్

సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో మనోహర్ పార్రికర్ మంగళవారం సాయంత్రం గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం  చేశారు. గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కోసం ఆయన నిన్ననే రక్షణమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతో బాటు మొత్తం 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

విశేషం ఏమిటంటే వారిలో భాజపా నుంచి ఇద్దరే ఉండగా భాజపాకు మద్దతు ఇచ్చినందుకు ఎం.జి.ఎఫ్ మరియు జి.ఎఫ్.పి.ల నుంచి చెరో ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కారీ, వెంకయ్య నాయుడు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. 

మనోహర్ పార్రికర్ గురువారం శాసనసభలో తన బలం నిరూపించుకోవలసి ఉంటుంది. భాజపాకు మద్దతు ఇచ్చిన వారందరికీ మంత్రి పదవులు పంచిపెట్టేశారు కనుక బలనిరూపణలో నెగ్గడం కేవలం లాంఛనప్రాయమే అని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ గోవా మీద ఆశలు వదిలేసుకొని తన పార్టీలో మొదలైన లుకలుకలపై దృష్టి పెట్టడం మంచిది.