గోవాలో భాజపాకు లైన్ క్లియర్

గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పార్రికర్ ప్రమాణస్వీకారానికి అడ్డంకులు తొలిగాయి. గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను కాదని, రెండవ స్థానంలో ఉన్న భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మృదులా సిన్హా ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు శలవులు కొనసాగుతున్నప్పటికీ అత్యవసర రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ తో కూడిన ధర్మాసనం ఇవ్వాళ్ళ ఈ కేసును విచారించి తీర్పు చెప్పింది. 

మనోహర్ పార్రికర్ గోవా ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయడానికి సుప్రీం ధర్మాసనం అనుమతించింది. కానీ గురువారంలోగా శాసనసభలో బలనిరూపణ చేసుకోవలాని ఆదేశించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేసిన అభ్యంతరాలపై ధర్మాసనం స్పందిస్తూ “మీకు ప్రభుత్వ ఏర్పాటు సరిపడినంత మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఉండేవారా? రాజ్ భవన్ ముందు ధర్నా చేస్తుండేవారు కదా?” అని  వ్యాఖ్యానించడం విశేషం. 

సాధారణంగాఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు, అవసరమైతే తరువాత బలనిరూపణకు అవకాశం కల్పించాలి. కానీ సుప్రీంకోర్టు కూడా ఈవిధంగా స్పందించడం, తీర్పు చెప్పడం విమర్శలకు తావిచ్చేదిగా ఉంది.