కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు కమల్ హాసన్ గత కొన్ని నెలలుగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన నిన్న చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

“పళనిస్వామి నేతృత్వంలో సాగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేదు. కనుక దానికి అధికారంలో కొనసాగే హక్కులేదు. కనుక తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలి. అప్పుడు ప్రజలే తమకు నచ్చిన పార్టీని, నాయకుడిని ఎన్నుకొంటారు. రాజకీయ పార్టీలు బలవంతంగా ప్రజలను పరిపాలించాలనుకోవడం సరికాదు. 

రాజకీయ నేతలు మా సినిమాల గురించి విమర్శిస్తున్నట్లుగానే, నేను రాజకీయనేతలను విమర్శిస్తున్నాను. ప్రభుత్వంలో అవినీతి, అసమర్ధత పెరిగినప్పుడు ప్రజలు తిరగబడతారని చాలాసార్లు రుజువైంది. నేను కూడా ఒక దేశ పౌరుడిగానే నా అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నాను. చేస్తుంటాను. నేను రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యంతో కాక, ప్రజల తరపున ప్రభుత్వాలను నిలదీస్తూ మాట్లాడుతుంటాను. కానీ నా మాటలను రాజకీయ కోణంలో నుంచి అందరూ చూస్తున్నారు. నేను ఈ ఇంటర్వ్యూకి ఎర్ర చొక్కా వేసుకొని వచ్చినంత మాత్రాన్న కమ్యూనిస్టులతో చేతులు కలుపబోతున్నట్లు భావించరాదు.  నన్ను రాజకీయాలలోకి రప్పించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. నాకు ఎవరి మీద ప్రత్యేకాభిమానం లేదు ఎవరితోనూ శత్రుత్వం లేదు. 

ఆనాడు నా విశ్వరూపం సినిమాను ముస్లింలు అడ్డుకోలేదు. అధికార పార్టీ (జయలలిత ప్రభుత్వం) అన్న సంగతి నాకు తెలుసు. జయలలిత రాజకీయ జీవితంలో ఏనాడూ పారదర్శకత లేదు. అందుకే ఆమెకు అందించిన వైద్యం, ఆమె మృతి కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. దానిపై ప్రజలలో అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. 

తమిళనాడు ప్రజాధారణ ఉన్నంతకాలం ద్రవిడపార్టీలకు తిరుగు ఉండదు. ఒకవేళ కాంగ్రెస్, భాజపాలు రాష్ట్రంలో ప్రవేశించదలచుకొంటే అవి తప్పనిసరిగా ద్రవిడపార్టీలను డ్డీకొని నిలబడవలసి ఉంటుంది,” అని కమల్ హాసన్ అన్నారు.