అంత దుఃఖంలోను సభకు హాజరు

మొన్న గుండెపోటుతో మరణించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు నిన్న జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సమావేశాలు ఇవ్వాళ్ళ మొదలవగానే మొదట భూమా మృతికి సంతాపం పాటించాయి. భూమా మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన ఆయన కుమార్తె, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అంత బాధలోను ఈరోజు శాసనసభకు హాజరవడం విశేషం. ఉభయసభల సభ్యులు ఆమెకు సానుభూతి తెలిపి ఆమెకు అండగా నిలబడతామని ధైర్యం చెప్పారు. భూమా నాగిరెడ్డి ఎప్పటికైనా రాష్ట్ర మంత్రి కావాలని కలలు కనేవారు. ఆయనకు మంత్రిపదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భావించారు. కానీ ఇంతలోనే భూమా ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నెల 28న ఉగాది పండుగలోగానే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు  ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక అఖిల ప్రియకు మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.