మణిపూర్ లో కూడా కమల వికాసమే

గోవాలో కాంగ్రెస్ పార్టీ భాజపా కంటే నాలుగు సీట్లు ఎక్కువే సంపాదించుకొన్నా, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో విఫలం అవడంతో చితికి అందివచ్చిన అధికారం చేజార్చుకొంది. అక్కడ మనోహర్ పార్రికర్ నేత్రుత్వంలో భాజపాయే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక మణిపూర్ లో కూడా కాంగ్రెస్ చురుకుగా పావులు కదపలేకపోవడం చేత అక్కడ కూడా భాజపాయే అధికారం దక్కించుకోబోతోంది. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన బైరెన్ సింగ్ ఈరోజు గవర్నర్ నజ్మా హెఫ్తుల్లాను కలిసి తనకు మొత్తం 32మంది ఎమ్మెల్యేలల మద్దతు ఉంది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు. 

మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇమ్మని కోరారు. కానీ గవర్నర్ భాజపా నేతకే అవకాశం ఇవ్వబోతున్నట్లు తాజా సమాచారం. గవర్నర్ సూచన మేరకు ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ రేపు తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.