గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మనోహర్ పార్రికర్ ఈరోజు ఉదయం తన రక్షణమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయన రేపు సాయంత్రం 5 గంటలకు గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గోవా శాసనసభలో మొత్తం 40 సీట్లు ఉండగా వాటిలో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకోగా భాజపా కేవలం 13 సీట్లు మాత్రమే గెలుచుకొంది. కానీ ఇతర పార్టీలకు చెందిన మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి పార్రికర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతోంది.
ఇక పంజాబ్ పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ మార్చి 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భాజపా అధిష్టానం ఇవ్వాళ్ళ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను ఖరారు చేయనున్నది. మణిపూర్ శాసనసభలో మొత్తం 60 సీట్లు ఉండగా వాటిలో కాంగ్రెస్ పార్టీకు 28, భాజపాకు 21 సీట్లు, మిగిలిన ఇతరులకు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కాంగ్రెస్ కోరుతోంది. భాజపా కూడా తమకే అవకాశం ఇవ్వాలని కోరుతోంది. ఈ కారణంగా మణిపూర్ లో కొంచెం అనిశ్చిత వాతావరణం నెలకొని ఉంది.