హాజరవ్వాలా...వద్దా?

నేడు తెరాస సర్కార్ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈరోజు జరిగే ఆ బడ్జెట్ సమావేశానికి హాజరవ్వాలా వద్దా? అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. తెదేపా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ఆటంకం కలిగించినందుకు తెరాస సర్కార్ వారిరువురినీ ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు సభ నుంచి సస్పెండ్ చేసింది. అది సబబు కాదని, సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె జానారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన అందుకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్, భాజపా, సిపిఎం సభ్యులు మొన్న సభ నుంచి వాక్ అవుట్ చేశారు. 

ప్రతిపక్ష సభ్యుల పట్ల తెరాస సర్కార్ తీరును నిరసిస్తూ ఈరోజు జరిగే బడ్జెట్ సమావేశాన్ని లేదా ఈ సెషన్ మొత్తం బహిష్కరిస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ సమావేశాలను బహిష్కరిస్తే అది తమపై, తెరాస సర్కార్ పై ఎటువంటి ప్రభావం చూపుతుంది?ఒకవేళ హాజరై చర్చలో పాల్గొని లోపాలను ఎత్తిచూపిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడితే మంచిదా? అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. 

ఒకవేళ బహిష్కరిస్తే, కుంటిసాకులతో కీలకమైన బడ్జెట్ సమావేశాలను హాజరవకుండా తప్పించుకొని పారిపోయి కాంగ్రెస్ పార్టీ చాలా బాద్యాతారాహిత్యంగా వ్యవహరించిందని తెరాస సర్కార్ ఆరోపణలు చేయడం ఖాయం. కాంగ్రెస్, తెదేపాలు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాయని తెరాస నేతలు వాదిస్తుంటారు. కనుక బద్దశత్రువులైన కాంగ్రెస్, తెదేపాలు కీలకమైన బడ్జెట్ సమావేశాలను హాజరవకపోతే తెరాస చేస్తున్న ఆ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుంది. దాని వలన కాంగ్రెస్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. కనుక బడ్జెట్ సమావేశానికి హాజరవ్వాలా వద్దా? అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. మరికొద్దిసేపటిలో తమ అభిప్రాయం తెలియజేస్తామని పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.