తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ 2017-18 ఆర్ధిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్ ను ఈరోజు మద్యాహ్నం 12గంటలకు శాసనసభలో ప్రవేశ పెట్టబోతున్నారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
ఈసారి బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు ఉండబోతున్నట్లు సమాచారం. ఇది గత ఏడాదికంటే సుమారు 16 వేల కోట్లు ఎక్కువ. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సాయంత్రం ప్రగతి భవన్ లో మంత్రివర్గ సమావేశం నిర్వహించి బడ్జెట్ లో ప్రభుత్వ ప్రధాన్యాతల గురించి వారికి వివరించారు. యధాప్రకారం ఈసారి కూడా బడ్జెట్ లో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యా, వైద్యం, సంక్షేమ రంగాలకు ఎక్కువ కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఈసారి బడ్జెట్ లో అభివృద్ధి, వివిధ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం బారీగా నిధులు కేటాయించబోతున్నందున ఆ విషయాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి, బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్ లో నిర్వహణ వ్యయం, ప్రగతి వ్యయం అనే రెండు కొత్త పద్దుల క్రింద నిధుల కేటాయింపులు జరుగుతాయి.